నేడు హైదరాబాద్ లో ‘బీసీ ఆత్మ గౌరవ సభ’ హాజరుకానున్న మోడీ

నేడు హైదరాబాద్ లో బిజెపి బీసీ ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేయబోతుంది. ఈ భారీ సభకు ప్రధాని మోడీ హాజరుకాబోతున్నారు. సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. సాయంత్రం ఐదున్నర నుండి 6 గంటల 15 నిమిషాల వరకు వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6.30 నిమిషాలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

బీసీ ఆత్మగౌరవ సభకు మోడీ రావడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. బీసీ సీఎం నినాదంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. బీసీలకు భరోసా ఇచ్చేలా ప్రధాని మోడీ ఈ సభలో మాట్లాడతారని, బీసీలకు హామీలను ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరుకాబోతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన – బిజెపి కలిసి బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 9 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుండగా..మిగతా స్థానాలలో బిజెపి పోటీ చేయబోతుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ, పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికలో కలుస్తున్నారు. ఈ తరుణంలోనే.. పవన్ ఏమి మాట్లాడుతారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.