ప్రతిపక్షాల కూటమి పేరు I-N-D-I-A..?

ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ పేరుతో ఎన్నికల్లోకి!

Opposition coalition likely to be called INDIA – Indian National Democratic Inclusive Alliance

న్యూఢిల్లీః 2024 లోక్ సభ ఎన్నికల్లో అధికార బిజెపిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించేందుకు, వ్యూహాలు రచించేందుకు బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో విపక్షాలు రెండో రోజైన మంగళవారం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ సహా ఆయా పార్టీలు పదకొండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. విపక్ష పార్టీల ఐక్య కూటమికి పేరు కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీల ఫ్రంట్‌కు I-N-D-I-A అనే పేరును ప్రతిపాదించగా, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (I-N-D-I-A- భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్ఠి కూటమి) అనే పేరు దాదాపు ఖాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కాసేపట్లో ఫ్రంట్ నేతలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

నిన్న జరిగిన విందు సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్రంట్‌కు పేరు సూచించాలని సూచించారు. ఈ రోజు ఆ పేర్లను పరిశీలించి, చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా I-N-D-I-A పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

ఈ రోజు సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శరద్ పవార్ నిన్నటి భేటీకి హాజరు కాలేదు. కానీ ఈ రోజు మాత్రం హాజరయ్యారు.