మార్గదర్శి చిట్ ఫండ్ కేసు..ఏపీ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

చిట్ రిజిస్ట్రార్ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు

ap high court
ap high court

అమరావతిః మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిట్ లను రద్దు చేస్తూ చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. చిట్ లు చెల్లవంటూ చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఉత్తర్వులపై ముగ్గురు ఖాతాదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా, ఖాతాదారుల తరపున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, దమ్మాలపాటి శ్రీనివాస్, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు.

చిట్ లకు డిపాజిట్లు సేకరించి చిట్ రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే చిట్లు ప్రారంభమయ్యాయని ఖాతాదారుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 50 శాతం డబ్బు చెల్లించి చిట్ లు ప్రారంభించామని మార్గదర్శి తరపు లాయర్ చెప్పారు. చిట్ రిజిస్ట్రార్ కు చిట్ లను రద్దు చేసే అధికారం ఉంటుందని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు చిట్ రిజిస్ట్రార్ ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది.