మణిపూర్‌లో నేడు, రేపు పర్యటించనున్న ఇండియా కూటమి ఎంపీలు

Oppn team, including 20 MPs, to visit to violence-hit Manipur today

న్యూఢిల్లీ: మణిపూర్‌ గత కొన్ని రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. అయితే మణిపూర్‌లో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు. హింస చెలరేగిన ప్రాంతాలు, అక్కడి పునరావాస కేంద్రాలను సందర్శిస్తారు. బాధితులను కలిసి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఇండియా కూటమి లోని 16 పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలు ఇప్పటికే మణిపూర్‌ చేరుకున్నారు. ఆదివారం రాష్ట్ర గవర్నర్‌ అనుసూయా ఉయికేని కలువనున్నారు. కాగా, తాము పరిశీలించిన అంశాలను పార్లమెంటులో చర్చించాలని కూటమి నేతలు ఇప్పటికే నిర్ణయించారు.

తాము ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావించడానికి అక్కడికి వెళ్లడం లేదని, మణిపూర్‌ ప్రజల బాధను అర్థం చేసుకోవడానికి మాత్రమే వెళ్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధురి అన్నారు. ఈ సున్నిత అంశానికి ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని కోరుతున్నామని చెప్పారు. ఇది కేవలం శాంతిభద్రతల అంశం కాదని, అక్కడ మతపరమైన హింస కూడా జరుగుతున్నది వెల్లడించారు. అది పొరుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతున్నదని తెలిపారు. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో వాస్తవ పరిస్థితులను అంచనా వేయబోతున్నామని చెప్పారు.

మణిపూర్‌లో పర్యటిస్తున్న వారిలో అధీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, ఫూలో దేవి నేతమ్, కే.సురేశ్‌ (కాంగ్రెస్‌), సుస్మితా దేవ్ (టీఎంసీ), సుశీల్‌ గుప్తా (ఆప్‌), అర్వింద్‌ సావంత్‌ (శివసేన-ఉద్ధవ్‌), కనిమొళి కరుణానిధి (డీఎంకే), రాజీవ్ రంజన్ లాలన్ సింగ్, అనీల్‌ ప్రసాద్‌ హెగ్డే, సంతోశ్‌ సింగ్‌ (సీపీఐ), ఏఏ రహీమ్ (సీపీఎం), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), మహువా మాజి (జేఎంఎం), పీపీ మహమ్మద్ ఫైజల్ (ఎన్‌సీపీ), ఈటీ మహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్‌), ప్రేమ్ చంద్రన్ (ఆర్‌ఎస్పీ), డీ.రవికుమార్, తిరు తోల్ తిరుమావళవన్ (వీసీకే), జయంత్ సింగ్ (ఆర్‌ఎల్డీ) ఉన్నారు.