పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన APSRTC

APSRTC పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. పదో తరగతి ఫైనల్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులు తమ వద్దనున్న హాల్‌ టికెట్‌ చూపించి పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రయాణించొచ్చని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షలు జరిగినన్ని రోజులూ ఈ వెసులుబాటు ఉండనుంది.

ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 3,348 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 6.64 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బస్సుల కోసం విద్యార్థులు ఇక్కట్లు పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బస్సు రవాణా లేని చోట విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే డీఈఓ ద్వారా ఆర్టీసీకి విఙప్తి చేస్తే ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పిస్తామని వివరించారు.