బిఆర్ఎస్‌కు 100 రోజులే మిగిలి ఉన్నాయిః షబ్బీర్ అలీ

కాంగ్రెస్ ఏం పీకిందో మీ తండ్రిని అడగాలని కెటిఆర్‌కు సూచన

shabbir-ali

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్‌ నిన్న మాట్లాడిన మాటలు అప్రజాస్వామికమని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జానెడంత లేని కెటిఆర్‌ ఏం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కెటిఆర్‌ కాన్వాయ్ వెళ్లే రోడ్లు అన్నీ మూసేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ నేతలను అంతకుముందు అర్ధరాత్రి నుండే అరెస్ట్ చేశారన్నారు.

కాంగ్రెస్ పీకిందేమీ లేదని కెటిఆర్‌ అంటున్నారని, కానీ మేం ఏం పీకామో మీ తండ్రి కెసిఆర్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఏం పీకారంటూ మీరు వాడుతున్న భాష తమకు రాదన్నారు. కెసిఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ప్రతి ఐటీ కంపెనీ నుంచి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని షబ్బీర్ ఆరోపించారు. కెటిఆర్‌.. ఎగిరెగిరి పడకు. ఇంకా మీకు 100 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నుండి ఎవరు పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి తనదేనని, తాను గెలవడం పక్కా అన్నారు. తాను చెప్పకపోయినప్పటికీ ఇక్కడి ప్రజలు కేటీఆర్‌ను నిలదీశారన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టకపోతే నా పేరు షబ్బీర్ అలీయే కాదన్నారు. కామారెడ్డికి తాను ఏం చేశానో కేసీఆర్‌ను అడిగితే చెబుతాడన్నారు. కౌన్సిల్‌లోనే తన గురించి కేసీఆర్ ఏం చెప్పారో కేటీఆర్ తెలుసుకొని మాట్లాడాలన్నారు.