వచ్చే వారం గ్రేటర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ : మంత్రి కెటిఆర్

లబ్దిదారుల వెరిఫికేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు

ts-govt-ready-to-distribute-double-bedroom-houses-in-hyderabad

హైదరాబాద్‌ః గ్రేటర్ పరిధిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను వచ్చే వారం నుంచి లబ్దిదారులకు అందించనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. తొలివిడతలో దాదాపు 75 వేలకు పైగా డబుల్ బెడ్రూంలను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈమేరకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లతో ఆయన సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా హాజరైన ఈ భేటీలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తికావచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, పేదలకు పంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 70 వేల ఇళ్లతో పాటు చివరి దశలో ఉన్న మరో ఐదు వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి వచ్చే వారం నుంచి లబ్దిదారులకు అందజేస్తామని వివరించారు. గ్రేటర్ లో ఇప్పటికే 4,500 లకు పైగా ఇళ్లను లబ్దిదారులకు అందించినట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికలో రాజకీయ నేతల జోక్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కెటిఆర్ వివరించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పరిశీలించి, అర్హులను గుర్తించిందని చెప్పారు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.