ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనః డీకే శివకుమార్‌

on-june-20-we-will-hold-protests-against-bjp-across-the-state-karnataka-deputy-cm-dk-shivakumar

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డీకే శివకుమార్‌ చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము ప్రజలకు ఇచ్చిన ఉచిత బియ్యం హామీ నెరవేర్చకుండా కేంద్రం కుట్రలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. బిజెపివి విద్వేష రాజకీయాలని డీకే శివకుమార్‌ మండిపడ్డారు. కేంద్రం ఎన్ని ఎత్తులు వేసినా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఉచిత బియ్యం హామీని తాము నెరవేర్చి తీరుతామని ఆయన స్పష్టంచేశారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ.. తాము గెలిస్తే ‘అన్న భాగ్య’ పథకం కింద పేద కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి 10 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది. దాంతో ప్రజలు బిజెపిని మట్టికరిపించి కాంగ్రెస్‌కు పట్టంకట్టారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘ఫుడ్‌ కార్పోషన్‌ ఆఫ్‌ ఇండియా ’ నుంచి అవసరమైన బియ్యం కొనుగోలుకు కర్ణాటకలోని కాంగ్రెస్‌ సర్కారు సిద్ధమైంది. కానీ, అందుకు కేంద్రం మోకాలడ్డింది. ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్రాలు బియ్యం కొనుగోలు చేసే నిబంధనల్లో మార్పులు చేసింది. కేవలం ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ఎఫ్‌సీఐ నుంచి బియ్యం కొనుగోలు చేసేలా రూల్స్‌ మార్చినట్లు తెలిసింది. దాంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై కర్ణాటక సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. విద్వేష రాజకీయాలు చేస్తున్న కేంద్రంలోని బిజెపి సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపడుతాయని డీకే శివకుమార్‌ వెల్లడించారు.