57 రాజ్య‌స‌భ స్థానాలకు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

ఈ నెల 24న నోటిఫికేష‌న్‌

న్యూఢిల్లీ: త్వ‌ర‌లో గడువు ముగియనున్న 57 రాజ్య‌స‌భ‌ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా 15 రాష్ట్రాల‌కు చెందిన ఈ సీట్ల‌కు జూన్ 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ నెల 24న విడుద‌ల చేయ‌నుంది. నామినేష‌న్‌కు చివ‌రి గ‌డువు మే 31వ తేదీ. మొత్తం 15 రాష్ట్రాల్లో ఉన్న 57 ఖాళీల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. యూపీలో 11, ఏపీలో 4, రాజ‌స్థాన్ లో 4, చ‌త్తీస్‌ఘ‌డ్ లో 4, జార్ఖండ్ లో 2, మ‌హారాష్ట్రలో 6, త‌మిళనాడులో 6, పంజాబ్ లో 2, ఉత్త‌రాఖండ్ లో 2, బీహార్ లో 5, తెలంగాణలో 2, హ‌ర్యానాలో రెండు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మూడు, ఒడిశాలో3 స్థానాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ల‌క్ష్మీకాంత రావు, ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌.. జూన్‌లో రిటైర్ కానున్నారు. ఆ ఇద్ద‌రి స్థానాల‌కు జూన్ 10న ఎన్నిక‌లు ఉంటాయి.

ఇక ఖాళీల వివ‌రాల్లోకెళితే… ఏపీలో 4 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో రెండు స్థానాల‌కు ఎన్నిక‌లు జరుగుతాయి. ఏపీలో వైస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి స‌హా.. బీజేపీ స‌భ్యులుగా ఉన్న సుజ‌నా చౌద‌రి, సురేశ్ ప్ర‌భు, టీజీ వెంక‌టేశ్‌ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. తెలంగాణ‌కు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు, డి. శ్రీనివాస్‌ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈ స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకే కొత్త‌గా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/