నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన చత్తీస్ గఢ్ సీఎం

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే నిరుద్యోగులకు భృతి అమలు

bhupesh-baghel-announces-allowance-for-unemployed-chhattisgarh-youth

రాయ్‌పూర్ః నిరుద్యోగులకు చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భాగెల్ శుభవార్త చెప్పారు. తమ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రతి నెల భృతి ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు. అంటే ఏప్రిల్ నుంచి యువతకు నిరుద్యోగ భృతి అందనుంది. అయితే నిరుద్యోగులకు ఉండాల్సిన అర్హతలేంటి? ప్రతి నెల ఎంత ఇస్తారు? ఇలా ఎంత మందికి, ఎన్ని నెలలు ఇస్తారు? అనే విషయాలుపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బస్తర్ జిల్లా జగ్దాల్ పూర్ లో గురువారం జాతీయ జెండాను భూపేశ్ భాగెల్ ఆవిష్కరించారు. తర్వాత ఆయన పలు ప్రకటనలు చేశారు. రాయ్ పూర్ ఎయిర్ పోర్టు దగ్గర్లో ఏరోసిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సౌకర్యాలను మెరుగుపరిచేందుకు, విమానాశ్రయ ప్రాంత అభివృద్ధి కోసం, ఉపాధి కల్పన కోసం ఏరోసిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికులకు గృహ నిర్మాణ సాయం చేస్తామని, మూడేళ్ల పాటు రూ.50 వేల గ్రాంట్ అందజేస్తామని వివరించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ముఖ్య హామీల్లో నిరుద్యోగ భృతి కూడా ఒకటి. ఈ ఏడాది ఆఖర్లో చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిరుద్యోగ భృతిపై ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/