వైద్యారోగ్య శాఖ‌లో త్వ‌ర‌లో 13 వేల నియామ‌కాలు : హ‌రీశ్‌రావు

రంగారెడ్డి: రాష్ట్ర ప్ర‌భుత్వం వైద్యారోగ్యశాఖ మంత్రి హ‌రీశ్‌రావు, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్‌ను, మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌ ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆశా వ‌ర్క‌ర్ల‌కు జీతాలు పెంచామ‌న్నారు. వైద్యారోగ్య శాఖ బ‌డ్జెట్‌ను డ‌బుల్ చేశామ‌న్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌తో పాటు బ‌స్తీ ద‌వాఖానాల్లో మందుల కొర‌త లేదు.. డాక్ట‌ర్లు మెడిసిన్స్ బ‌య‌ట‌కు రాసిన‌ట్లు త‌మ దృష్టికి వ‌స్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ఆశా వ‌ర్క‌ర్లు, ఏఎన్ఎమ్‌లు ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి టెస్టులు చేస్తున్నార‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు కూడా అప్పుడ‌ప్పుడు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను సంద‌ర్శించాల‌ని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30 శాతం మాత్రమే కాన్పులు ఉన్నాయ‌ని, ఈ ఏడేండ్ల‌లో 56 శాతం పెరిగాయని హ‌రీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న మేర‌కు ఆరోగ్య తెలంగాణ క‌ల‌ను సాకారం చేద్దామ‌ని మంత్రి పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే వైద్యారోగ్య శాఖ‌లో 13 వేల నియామ‌కాలు చేప‌డుతామ‌న్నారు. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ వెలువ‌డుతుంద‌ని మంత్రి పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/