మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా

నెల రోజుల వ్యవధిలో ఏడు క్షిపణి పరీక్షలు

North Korea test-fires two more missiles as tensions rise

సియోల్‌: ఇటీవల తన సరిహద్దుకు సమీపంలో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టడంపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహంతో ఉంది. గత కొన్నివారాలుగా ప్రత్యర్థులను హెచ్చరిస్తూ పలు క్షిపణి పరీక్షలు ముమ్మరం చేసింది. తాజాగా మరో రెండు మిస్సైళ్లను పరీక్షించింది. ఈ నెలలో ఇది ఏడో మిస్సైల్ ప్రయోగం. తూర్పు తీరం దిశగా ప్రయోగించిన ఈ రెండు మిస్సైళ్లు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ కేటగిరీకి చెందినవి.

ఈ క్షిపణి ప్రయోగాలు జరిగిన విషయాన్ని పొరుగునే ఉన్న దక్షిణ కొరియా నిర్ధారించింది. వీటిని ఉత్తర కొరియా పశ్చిమ భాగం నుంచి ప్రయోగించి ఉంటారని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. జపాన్ కోస్ట్ గార్డ్ దళాలు కూడా దీనిపై స్పందించాయి. ఈ రెండు క్షిపణులు జపాన్ ఎకనామిక్ జోన్ కు ఆవల ఉపరితలాన్ని తాకి ఉంటాయని వెల్లడించాయి.