నిఖత్ జరీన్ తెలంగాణకు గర్వకారణం: సిఎం కెసిఆర్‌

50 కిలోల కేటగిరీలో నిఖత్ జరీన్ కు స్వర్ణం

cm-kcr-appreciates-telangana-boxer-nikhat-zareen-who-won-gold-in-world-boxing-championship

హైదరాబాద్‌ః తెలంగాణ ముద్దుబిడ్డ, భారత బాక్సింగ్ ఆశాకిరణం నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. 50 కిలోల కేటగిరీలో నిఖత్ వియత్నాం బాక్సర్ ఎన్ గుయెన్ థి టామ్ పై 5-0తో విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది. దీనిపై తెలంగాణ సీఎం కెసిఆర్ స్పందించారు.

ఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో పసిడి పతకం గెలిచినందుకు నిఖత్ జరీన్ ను అభినందించారు. ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యంతో విజేతగా నిలిచిన నిఖత్ తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు. నిఖత్ తన వరుస విజయాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిందని తెలిపారు.

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ చరిత్రలో రెండు బంగారు పతకాలు సాధించడం గొప్ప విశేషమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వ కృషి ఇకముందు కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు.

కాగా, నిఖత్ జరీన్ గతేడాది టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో 52 కిలోల విభాగంలో పసిడి చేజిక్కించుకుంది. వరుసగా రెండో కూడా ప్రపంచ చాంపియన్ షిప్ లో నిఖత్ పతకం గెలవడం ఆమె ప్రతిభకు నిదర్శనం.