ఐక్యరాజ్యసమితిపై ఉత్తర కొరియా ఆగ్రహం

ప్యోంగ్యాంగ్: ఇటీవల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ప్రత్యేక ప్రతినిధి థామస్ ఓజియో క్వింటానా ఉత్తరకొరియాకు సంబంధించి ఓ నివేదికను రూపొందించారు. దేశంలో లాక్ డౌన్ తో జనజీవనం దయనీయంగా మారిందని, అంతర్జాతీయ ఆంక్షలు సడలించి ఉత్తర కొరియాకు సాయం అందించాలని సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే ఉత్తర కొరియాలో ఆకలి చావులు నమోదవడం ఖాయమని నివేదికలో పేర్కొన్నారు.

అయితే ఆ నివేదిక అంతా తప్పులతడక అంటూ ఉత్తర కొరియా అధినాయకత్వం మండిపడింది. ఆ నివేదికను తాము గుర్తించడంలేదంటూ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఉత్తర కొరియా పరిస్థితులను క్వింటానా వక్రీకరించారని, ఉత్తర కొరియాలో మానవ హక్కులు, స్థానిక స్థితిగతులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయనడంలో నిజం లేదని తెలిపింది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలను మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొనడం గర్హనీయమని స్పష్టం చేసింది. అసలు, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమకు ఆమోదయోగ్యం కాదని, ఇదంతా అమెరికా ప్రోద్బలిత కార్యక్రమాల్లో భాగమని ఉత్తర కొరియా ఆరోపించింది. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/