హుజురాబాద్ ఉప ఎన్నిక : ఈరోజుతో ప్రచార పర్వం ముగింపు

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఈరోజుతో ముగియనుంది. గత మూడు నెలలుగా మోతమోగిస్తున్న మైకులు ..ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత మూగబోనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గ్రాండ్ గా ప్రచారాన్ని ముగించాలని చూస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని పార్టీలకు సమయం మిగిలి ఉంది. పార్టీ విధానాలు వివరించాలన్నా, ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడాలన్నా..ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు కేవలం వారికి మిగిలి ఉంది ఈ 12 గంటలే. అందుకే, వీలైనన్ని ప్రెస్‌మీట్లు, రోడ్‌షోలు నిర్వహించాలని టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల అధిష్టానాలు ఆదేశించాయి.

కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో గతంలో 48 గంటలుగా ఉండే సైలెన్స్‌ పీరియడ్‌ (ఎన్నికకు ప్రచారానికి మధ్య విరామ సమయం) ఈసారి 72 గంటలుగా ఈసీ నిర్ణయించింది. ఈ 72 గంటల్లో మద్యం, నగదు పంపిణీకి దిగే పార్టీలు, వారి నేతలపై పోలీసులు దృష్టి సారించనున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు నేటి సాయంత్రం 7 గంటల నుంచి 72 గంటల పాటు ఎలాంటి విక్రయాలు చేపట్టకూడదు. ఈ పరిణామం 24 గంటలపాటు మద్యం విక్రయాలపై ప్రభావం చూపనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు స్థానికేతరులంతా నేటి సాయంత్రానికి నియోజకవర్గం వీడాలి. ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపకుండా ముందు జాగ్రత్తగా ఈసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది.

జూన్‌ 12న ఈటల రాజేందర్‌ రాజీనామా తర్వాత రోజు నుంచి హుజూరాబాద్‌లో బీజేపీ- టీఆర్‌ఎస్‌లు ప్రచారం మొదలుపెట్టాయి. సరిగ్గా 137 రోజులు, నాలుగున్నర నెలల విమర్శల సంగ్రామానికి నేటి సాయంత్రం 7 గంటలతో ముగింపు రానుంది. ఇక ప్రలోభాల పర్వానికి తెరలేవనుంది. ఇప్పటికే నాలుగైదు నెలలుగా పలు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక తాయిలాలు, విందులు, వినోదాలు, బహుమతులు అందజేశాయి. మరి ఓటర్లు ఎవరికీ వారి అమూల్యమైన ఓటు వేస్తారో చూడాలి.