శ్రీలంకలో వారం రోజులపాటు పాఠశాలలు మూసివేత

కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను చమురు కొరత వేధిస్తున్నది. రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్‌ను పంపిణీ చేస్తున్నప్పటికీ అది అవసరాలను తీర్చలేకపోతున్నది. దీంతో శ్రీలంక ప్రభుత్వం వారం రోజులపాటు బడులను మూసివేయాలని నిర్ణయించింది. రాజధాని కొలంబోతోపాటు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బడులను నేటి నుంచి వారంపాటు తెరవద్దని అధికారులను ఆదేశించింది.
విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని స్కూళ్ల యాజమాన్యాలకు విద్యాశాఖ మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చని, అయితే ట్రాన్స్‌పోర్టేషన్‌తో సంబంధం లేని విద్యార్థులనే బడులకు అనుమతించాలని చెప్పారు. విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వినేందుకుగాను ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎలాంటి విద్యుత్ కోతలు ఉండకుండా చూడాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. చమురు సంక్షోభంతో జూన్ 18 నుంచి వారం రోజుల పాటు దేశంలో స్కూళ్లను ప్రభుత్వం బంద్ చేసింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన (1948) తర్వాత శ్రీలంక ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటి సారి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/