వైట్ హౌస్, పెంటగాన్ ఫొటోలు తీసిన ఉత్త‌ర నిఘా ఉపగ్రహం !

కిందటి వారం అంతరిక్షంలోకి నార్త్ కొరియా స్పై శాటిలైట్

North Korea Claims New Spy Satellite Took Photos Of White House, Pentagon

పోంగ్‌యాంగ్‌ః నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాము అంతరిక్షంలోకి పంపిన నిఘా ఉపగ్రహం అమెరికా అధ్యక్ష భవనాన్ని ఫొటోలు తీసిందని చెప్పారు. వైట్ హౌస్ తో పాటు పెంటగాన్, అక్కడికి దగ్గర్లోని నావల్ బేస్ ల ఫొటోలను మంచి క్లారిటీతో తీసిందన్నారు. గ్వామ్, పెరల్ హార్బర్ సహా పలు కీలక ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలను తీసి పంపించిందని చెప్పారు. సుప్రీం లీడర్ కిమ్ ను కోట్ చేస్తూ నార్త్ కొరియా ప్రభుత్వ మీడియా ఈ వివరాలను వెల్లడించింది.

కిందటి వారం నార్త్ కొరియా ఓ నిఘా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది. ఈ శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి చేరిందని, ఇప్పటికే తన పని మొదలు పెట్టిందని కిమ్ సోమవారం వెల్లడించారు. ఈ ఉపగ్రహంతో నార్త్ కొరియా శత్రువులపై నిరంతరం నిఘా పెడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహ పనితీరును పరిశీలిస్తున్నామని, డిసెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో నిఘా పెడతామని చెప్పారు.

అయితే, నార్త్ కొరియా పంపించిన ఉపగ్రహం గురించి కానీ, దాని పనీతీరు గురించి కానీ బయటి ప్రపంచానికి ఎలాంటి వివరాలు తెలియవు. వాటితో పాటు ప్రస్తుతం ఆ శాటిలైట్ తీసినట్లు చెబుతున్న ఫొటోల వివరాలపైనా ప్రపంచ దేశాలకు ఎలాంటి స్పష్టత లేదు. శాటిలైట్ వివరాలు కానీ, అది తీసిన ఫొటోలు కానీ నార్త్ కొరియా ఇప్పటి వరకు బయటపెట్టలేదు.