జగన్ సర్కార్ ఫై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు

ఏపీ సీఎం జగన్ సర్కార్ ఫై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం మంచి కార్యక్రమం అని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయో లేదో తెలుసుకోవడం ఎంతో అవసరం అని ఆయన అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం కావడం చాలా మంచిదన్న ఆయన ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరగకుండా ..రాజకీయ నాయకులు.. దళారుల జోక్యం లేకుండా ఉండేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పథకాన్ని ప్రధాని మోడీ తీసుకువచ్చారని అన్నారు.

నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. అలాగే రోడ్లు నిర్వహణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. నీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులు ఉన్నప్పుడే గ్రామాలు, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టానన్నారు. స్ధానికంగా ఉన్న గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించడం ఎంతో అభినందనీయం అన్నారు. నెల్లూరు జిల్లా నుండి విదేశాలకు వ్యవసాయ పనిముట్లను ఎగుమతి చేయడం ఎంతో గర్వకారణం అన్నారు.