స్వప్రయోజనాల కోసం భారత్‌ యత్నిస్తుంది

పుల్వామా ఘటనపై 13,500 పేజీల ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన ఎన్ఐఏ

INDIA-PAKISTAN
INDIA-PAKISTAN

ఇస్లామాబాద్‌: జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ మంగళవారం నాడు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సహా మరో 19 మందిపై 13,500 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఇతర నిందితులలో మసూద్ అజార్ సోదరులు అబ్దుల్ రవూఫ్, అమర్ అల్వీ, మేనల్లుడు ఉమర్ ఫరూఖ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్పందిస్తూ భారత్ పై విషం చిమ్మింది. తమ దేశాన్ని ముద్దాయిగా చూపించేందుకు భారత్ కొంటె ప్రయత్నం చేస్తోందని పాక్ వ్యాఖ్యానించింది.

ఛార్జి షీట్ లో పేర్కొన్న ఆధారాలను నిరూపించడంలో భారత్ విఫలమైందని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ సంకుచిత మనస్తత్వానికి ఇదొక నిదర్శనమని చెప్పింది. వారి స్వప్రయోజనాల కోసమే భారత్ ఇలాంటి చర్యలకు దిగుతోందని దుయ్యబట్టింది. అధికార పార్టీ  బిజెపి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఛార్జ్ షీట్ ను రూపొందించారని ఆరోపించింది. పుల్వామా ఘటనలో ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పాకిస్థాన్ పై భారత్ వ్యతిరేక ప్రచారం చేస్తోందని మండిపడింది. అంతర్జాతీయ సమాజం ముందు తమను ఇరికించేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/