భౌతిక‌శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బ‌హుమ‌తి

nobel-prize-2022-in-physics

స్టాక్‌హోమ్‌: రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఈరోజు ఫిజిక్స్‌లో ఈ యేటి నోబెల్ బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది. భౌతిక‌శాస్త్రంలో ఈ సారి ముగ్గురికి ఆ అవార్డు ద‌క్కింది. అలేన్ ఆస్పెక్ట్‌, జాన్ ఎఫ్ క్లాజ‌ర్‌, ఆంటోన్ జిలింగర్‌ల‌ను ఈ యేటి ఫిజిక్స్ నోబెల్ బ‌హుమ‌తి వ‌రించింది. ఫోటాన్ల ప‌రిశోధ‌న‌, క్వాంట‌మ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ సైన్స్‌లో చేసిన ప్ర‌యోగాల‌కు గాను ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు భౌతిక‌శాస్త్ర నోబెల్ ద‌క్కింది. ఈ ముగ్గురి శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న ఆధారంగా క్వాంట‌మ్ ఇన్ఫ‌ర్మేష‌న్‌లో కొత్త టెక్నాల‌జీకి మార్గం సులువైంది. ప్ర‌స్తుతం క్వాంట‌మ్ కంప్యూట‌ర్స్‌, క్వాంట‌మ్ నెట్‌వ‌ర్క్స్‌, సెక్యూర్ క్వాంట‌మ్ ఇన్‌క్రిప్టెడ్ క‌మ్యూనికేష‌న్‌లో విస్తృత స్థాయిలో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ప‌ది మిలియ‌న్ల స్వీడిష్ క్రోన‌ర్ల‌ను ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు స‌మానంగా పంచ‌నున్నారు.

అలేన్ ఆస్పెక్ట్ 1947లో ఫ్రాన్స్‌లో ఏజెన్‌లో జ‌న్మించారు. పారిస్‌లోని స‌డ్ యూనివ‌ర్సిటీ నుంచి 1983లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పారిస్‌-సాక్లే అండ్ ఈకోల్ పాల‌క్నిక్ కాలేజీలో ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ప‌స‌డేనాలో జాన్ ఎఫ్ క్లాజ‌ర్ 1942లో జ‌న్మించారు. న్యూయార్క్‌లోని కొలంబియా వ‌ర్సిటీ నుంచి 1969లో పీహెచ్‌డీ చేశారు. ప్ర‌స్తుతం రీస‌ర్చ్ ఫిజిస్ట్‌గా చేస్తున్నారు. ఆస్ట్రియాలోని రీడ్‌లో ఆంటోన్ జీలింగ‌ర్ జ‌న్మించారు. వియ‌న్నా వ‌ర్సిటీలో 1971లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. వియ‌న్నా యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/