ఏపీలో పలుచోట్ల వర్షాలు

ఏపీలో పలు చోట్ల వర్షాలు పడుతుండడంతో రాష్ట్ర ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా విపరీతమైన ఎండ తో ప్రజలు అల్లాడిపోతుండడంతో..ఈ వర్షాలు కాస్త చల్లపరిచాయి. ఏపీలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు మండల్లాలో భారీ వర్షం కురిసింది.

ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. అనకాపల్లి, చోడవరం, వడ్డాది, మాడుగుల, చీడికాడ.., విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. భారీ వర్షం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ ఆకస్మిక వర్షాలు సహజమేనని వాతావరణ అధికారులు చెప్తున్నారు.