వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ఒంటరిగానే పోటీచేస్తుందిః మంత్రి పెద్దిరెడ్డి

పొత్తుల అవసరం విపక్షాలకే ఉందని ఎద్దేవా

no-need-for-alliance-we-will-fight-alone-in-assembly-elections-says-ycp-leader-peddireddy

అమరావతిః రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్‌ఆర్‌సిపి నేత, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్‌ఆర్‌సిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమకు పొత్తుల అవసరం లేదని పార్టీ చీఫ్, సీఎం జగన్ గతంలోనే వెల్లడించారు. ఆ పార్టీ నేతలు కూడా తరచూ ఇదే విషయాన్ని మీడియా ముందు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పొత్తుల అవసరం విపక్ష నేతలకే ఉందని చెప్పారు.

తాము ప్రజలకు మంచి చేశామని, జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి కి ప్రజల అండ మాత్రమే కావాలని, ఇతర పార్టీలు అండగా ఉండాల్సిన అవసరంలేదని పెద్దిరెడ్డి తేల్చిచెప్పారు.

2014లో పొత్తులతో పోటీ చేసిన విపక్షాలు 2024లోనూ ఉమ్మడిగానే బరిలో నిలబడతాయని పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయంగా శక్తిహీనుడు అయ్యాడని వ్యాఖ్యానించారు. అందుకే అందరి సహకారం ఆయనకు అవసరమని చెప్పారు. ఇక, రాయలసీమ ప్రజలకు ఎవరు ఎంత మేలు చేశారనేది ప్రజలకు బాగా తెలుసని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.