ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర

cm-jagan

అమరావతిః ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా సిద్ధం సభలతో ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ రానున్న రోజుల్లో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. వైనాట్ 175 అనే సింగిల్ టార్గెట్ తో జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాట్లాడుతూ… మేమంతా సిద్ధం పేరుతో జగన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారని చెప్పారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. సిద్ధం సభలు జరిగిన నాలుగు ప్రాంతాలు మినహా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు జరుగుతాయని చెప్పారు. ప్రతి రోజు జగన్ ప్రజల్లోనే ఉంటారు… రాత్రి కూడా ప్రజల మధ్యే నిద్రిస్తారని తెలిపారు. ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం జగన్ చేస్తారని చెప్పారు. రేపు పూర్తి షెడ్యూల్ వెల్లడిస్తామని తెలిపారు.