బాలు అంత్యక్రియలకు అభిమానులకు ప్రవేశం లేదు

అభిమానులు సహకరించాలన్న తిరువళ్లూరు కలెక్టర్

బాలు అంత్యక్రియలకు అభిమానులకు ప్రవేశం లేదు
SP Balasubrahmanyam

చెన్నై: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు తిరువళ్లూరు జిల్లాలోని తామరైపాక్కంలోని ఆయన ఫామ్ హౌస్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఫామ్ హౌస్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేశామని, అభిమానులకు ప్రవేశం లేదని, దయచేసి అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. బారికేడ్లను దాటి ఏ వాహనాన్ని కూడా అనుమతించబోమని, ప్రొటోకాల్ అధికారులకు మాత్రమే ఫామ్ హౌస్ వరకూ అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సాధ్యమైనంత తక్కువ మందికి మాత్రమే అంత్యక్రియలను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతి ఇస్తామని అన్నారు.

కాగా, గత రాత్రే చెన్నైలోని కొడంబాక్కం నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో బాలూ పార్ధివదేహాన్ని, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తామరైపాక్కంకు తరలించారు. తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనుండగా, ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/