ఎయిరిండియా ప్రైవేటీకరణ తప్పదు

ప్రైవేటీకరణ ప్రక్రియకు ఉద్యోగులంతా సహకరించాలి

Hardeep Singh Puri
Hardeep Singh Puri

ముంబయి: ఎయిరిండియాను ప్రైవేటీకరించడం తప్ప మరో మార్గం లేదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియకు ఉద్యోగులంతా సహకరించాలని ఆయన కోరారు. ఎయిరిండియాకు చెందిన యూనియన్ల నేతలతో నిన్న జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు స్పష్టం చేశారు. ఎయిరిండియా రుణభారం రూ. 80,000 కోట్ల పైగా ఉందని, ఏ నిపుణుడి దగ్గరా దీనికి పరిష్కార మార్గాలు లేవని మంత్రి చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కంపెనీని ప్రైవేటీకరించడం ఒక్కటే ప్రభుత్వం ముందున్న మార్గమని తెలిపారు. అయితే, ఎయిరిండియా ప్రవేటీకరణ ప్రణాళికలపై యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం కొంత మద్దతునిస్తే కంపెనీని నిర్వహించుకోగలిగే సామర్థ్యం ఉద్యోగులకు ఉందని పేర్కొన్నాయి. కాగా ప్రైవేటీకరించినా..ఉద్యోగ భద్రత వంటి విషయాల్లో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి చెప్పినట్లు యూనియన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/