కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో జగన్ భేటీ..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన లో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రమంత్రితో సీఎం జగన్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను వేర్వేరుగా కలుసుకుని పలు అంశాలపై చర్చించి వినతి పత్రాలను అందజేశారు.

సోమవారం జగన్ మోహన్ రెడ్డి , ప్రధాని మోడీల భేటీ జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత జగన్‌తో సమావేశానికి ప్రధాని అవకాశం ఇచ్చారు. ప్రధాని మోడీతో గంటపాటు పలు అంశాలపై చర్చించారు. జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మిథున్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను జగన్..మోడీకి నివేదించారు.

రాష్ట్ర విభజన ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. విభజన సమయంలో 58 శాతం, జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం మాత్రమే రెవెన్యూ దక్కిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఈ గణాంకాలే నిదర్శనమని ప్రధానితో జగన్‌ అన్నారు. ఏప్రిల్‌ 1, 2014 అంచనాల మేరకే పోలవరం నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్ట్‌ వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదని’’ ప్రధానికి సీఎం వివరించారు.