రాజ్యసభ స్థానానికి టీఆర్ఎస్ నుండి నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు రవిచంద్ర

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నుండి రాజ్యసభ స్థానానికి వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) నామినేషన్ దాఖలు చేసారు. గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ దాఖలు కంటే ముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపానికి రవి నివాళులర్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు రవి నామినేషన్ దాఖలు చేశారు.
ఇక రవి వెంట మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ తాత మధు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
నిన్న బుధువారం టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం ముగియడంతో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు.
హెటిరో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) , నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు పేర్లను కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీకి తగినంత సంఖ్యా బలం ఉండటంతో ఈ మూడు రాజ్యసభ సీట్లు అధికార పార్టీకే దక్కనున్నాయి.