ముగిసిన కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం.. లోక్‌సభ రేపటికి వాయిదా

Nirmala Sitharaman’s budget speech is over… Lok Sabha adjourned till tomorrow

న్యూఢిల్లీః సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ను ఈరోజు ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) కి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో చదివి వినిపించారు. ఉదయం 11 గంటలకు తన బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. 12 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. దాదాపు గంటపాటు ఈ ప్రసంగం సాగింది. నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత అందుకున్నారు. పార్లమెంట్‌లో ఆమె నేడు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆర్థికమంత్రిగా నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. ఈ క్రమంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు.

2019 జూలై నుంచి ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో ఆమె వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన గత ఆర్థిక మంత్రులు మన్మోహన్‌సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను అధిగమించారు. ఇక మొరార్జీ దేశాయ్ 1959-64 మధ్య ఆర్థికమంత్రిగా వరుసగా ఐదుసార్లు వార్షిక బడ్జెట్, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా ఆయన 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.