కరోనా కంటే నిఫా వైరస్‌ చాలా డేంజర్ : ఐసీఎంఆర్ చీఫ్ రాజీవ్

మరణాల రేటు చాలా ఎక్కువని ఐసీఎంఆర్ చీఫ్ హెచ్చరిక

‘Nipah virus mortality rate very high than Covid-19’: ICMR director general

తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ కేసులు పెరుగుతుండడంపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఈ వైరస్ తో మరణాల రేటు ఎక్కువని హెచ్చరించింది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కంటే కూడా నిఫా వైరస్ ఎక్కువ ప్రమాదకారి అని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ రాజీవ్ బాహి పేర్కొన్నారు. కరోనాతో మరణాల రేటు కేవలం 3 శాతం మాత్రమే.. నిఫా వైరస్ తో మరణాల రేటు 40 నుంచి 70 శాతం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే కేరళలో వైరస్ కేసులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ తయారుచేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. బాధితుల చికిత్సలో ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీ డోసులను ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మందుతో నిఫా బాధితులు కోలుకుంటారని, విదేశాలలో 14 మంది నిఫా బాధితులు కోలుకున్నారని వివరించారు.

కేరళలోని కోజికోడ్ లో వైరస్ కేసులు పెరుగుతుండడంతో అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. వైరస్ బారిన పడి చనిపోయిన వారి గ్రామంతో పాటు చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో కంటైన్ మెంట్ ప్రకటించారు. జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు జిల్లా అధికారులు వివరించారు. మరోవైపు, కేరళ పొరుగున ఉన్న కర్ణాటక కూడా అప్రమత్తమైంది. నిఫా కేసులు పెరుగుతుండడంతో అత్యవసరమైతే తప్ప కేరళకు వెళ్లొద్దంటూ సరిహద్దు గ్రామాల ప్రజలను హెచ్చరించింది. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి వచ్చే వారిని పరీక్షించే ఏర్పాటు చేసింది.