పంజాబ్‌లోని ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులు జప్తు

NIA seizes assets of Khalistani extremist Gurpatwant Singh Pannun in Punjab

చండీగఢ్‌: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) జప్తు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద పంజాబ్‌లోని చండీగఢ్, అమృత్‌సర్‌లో ఆయనకు చెందిన ఆస్తుల వద్ద జప్తు నోటీసులు ఉంచింది. చండీగఢ్‌లోని నివాసంతోపాటు అమృత్‌సర్‌లోని పూర్వీకుల గ్రామమైన ఖాన్‌కోట్‌లో గురుపత్వంత్ సింగ్‌కు చెందిన వ్యవసాయ భూమిని కూడా ఎన్‌ఐఏ జప్తు చేసింది. పన్నూన్‌ తండ్రి మొహిందర్ సింగ్ గతంలో తరన్ తరణ్‌లోని పట్టి సబ్ డివిజన్‌లోని నాథూ చక్ గ్రామంలో నివసించాడు. దేశ విభజన తర్వాత అమృత్‌సర్‌లోని ఖాన్‌కోట్ గ్రామానికి ఆ కుటుంబం మారింది.

కాగా, గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌, సిక్కులకు ప్రత్యేక ఖలిస్థాన్‌ కోసం వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారాలు చేయడంతోపాటు పంజాబ్‌లోని సిక్కు యువకులను మిలిటెన్సీలో చేరడానికి ప్రేరేపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2020 జూలైలో గురుపత్వంత్ సింగ్‌ను ఉగ్రవాదిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ గుర్తించింది. రెండు నెలల తర్వాత కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 51ఏ కింద ఆయన ఆస్తులను అటాచ్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.