ఈ నిర్బంధాలు ప్రజానాయకుడైన చంద్రబాబును ప్రజల నుంచి వేరు చేయలేవుః లోకేశ్‌

nara-lokesh-on-chandrababu-arrest

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్​మెంట్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఇప్పటికీ టిడిపి నేతలు, అభిమానులు, నారా, నందమూరి కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు అరెస్టుపై మరోసారి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి సర్కార్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి టిడిపిని దెబ్బకొట్టామ‌ని వైఎస్‌ఆర్‌సిపి అనుకుంటోందని లోకేశ్ అన్నారు. కానీ.. ఈ నిర్బంధాలు ప్రజల నుంచి చంద్రబాబును దూరం చేయలేవని తెలిపారు.

తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేసి టిడిపిని దెబ్బ కొట్టామని అనుకుంటున్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు సైకోలు అని లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ నిర్బంధాలు ప్రజానాయకుడైన చంద్రబాబును ప్రజల నుంచి వేరు చేయలేవని తెలిపారు. ఎప్పటికైనా నిజం గెలిచి తీరుతుందని అన్నారు. మ‌రింత‌ బ‌లంగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల కోసం-రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం ప‌నిచేస్తార‌ని తన తల్లి చెప్పిందంటూ లోకేశ్ ట్వీట్‌ చేశారు.

మరోవైపు.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. బాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మరణించిన టిడిపి కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. వారికి అండగా బాబు ఉంటారని భరోసా కల్పిస్తున్నారు.