ఎమ్మెల్యేల నియోజకవర్గ బదిలీలపై లోకేశ్ వ్యంగ్యం

ఒకరి ఇంట్లో చెత్త మరొకరి ఇంట్లో బంగారం అవుతుందా..?

nara-lokesh-comments-on-jagan

అమరావతిః సిఎం జగన్ వ్యవహారం ఓ కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ లా ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో రూ.10 ప్రజల ఖాతాల్లో వేసి తిరిగి వారి నుంచి రూ.100 లాగేసుకుంటున్నాడని విమర్శించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని గత ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మాటలు నమ్మి జనం ఓట్లు వేసి 31 మంది వైసీపీ ఎంపీలను గెలిపించగా.. ఇప్పుడేమో తనపై ఉన్న కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు తలవంచుతున్నాడని లోకేశ్ ఆరోపించారు. ఈమేరకు సోమవారం నరసన్నపేట శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగించారు.

ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లానికి మారుపేరని, శ్రీకాకుళం అంటే సింహమని లోకేశ్ పేర్కొన్నారు. సభకు హాజరైన ప్రజలను ఉద్దేశిస్తూ.. ఇక్కడున్న మీరంతా సింహాల్లా కన్పిస్తున్నారని అన్నారు. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోందని చెప్పారు. జగన్ పని అయిపోయిందని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలే చెబుతున్నారని గుర్తుచేశారు. ఎంపీలు ఆయనకు ముఖం చాటేస్తున్నారని, వారంతా బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చిన జగన్.. తీరా సీఎం కుర్చీలో కూర్చున్నాక జీపీఎస్ తీసుకొచ్చాడని లోకేశ్ మండిపడ్డారు. ఆయన నిర్వాకంతో ఉద్యోగులు కూడా బైబై జగన్ అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్యేల ట్రాన్స్ ఫర్ అనే కొత్త పథకం అమలవుతోందని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఒకరి ఇంట్లోని చెత్త ఇంకోచోట బంగారం అవుతుందా? ఇక్కడ పనికిరానివారు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు.. అంటూ నిలదీశారు.