అంగన్ వాడీలపై ఎస్మా ప్రయోగం.. నియంత పోకడలకు పరాకాష్ఠ : నారా లోకేశ్

nara-lokesh

అమరావతిః గత కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం తెలిసిందే. దీనిపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా నేరమా? అని ప్రశ్నించారు.

ఎస్మా ప్రయోగం, జీతంలో కోత నియంత పోకడలకు ప్రబల నిదర్శనం అని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం జీవో నెం.2ను వెనక్కి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అంతిమంగా నెగ్గేది అంగన్వాడీలేనని అన్నారు. ఏపీలో అంగన్వాడీల ఉద్యమానికి టిడిపి సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

ఇంకేమైనా మిగిలాయేమో వెతుక్కో జగన్!

సీఎం జగన్ కు ప్రచార పిచ్చి పెరిగిపోయిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. మరుగుదొడ్ల వద్ద కూడా జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల ఏంటో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకే ఏమైనా మిగిలాయేమో వెతుక్కో జగన్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. చెప్పుకోవడానికి చేసిందేమీ లేక ఇలా బోర్డులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాలు రాక రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, కానీ ఏమీ పట్టనట్టు ఇలా ఫ్లెక్సీలు కట్టుకుంటూ పోతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.