తెలుగు ప్రజల జీవితాలను మార్చాలన్న మీ తపన నాకు తెలుసుః చంద్రబాబు

చంద్రబాబు వీడియోను ట్వీట్ చేసి విష్ చేసిన యువనేత

nara-lokesh-birthday-wishes-to-chandrababu

అమరావతిః టిడిపి అధినేత, తన తండ్రి చంద్రబాబు నాయుడుకు యువనేత నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా లోకేశ్ ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు ప్రజల జీవితాలను మార్చాలని నిరంతరం మీరు పడే తపన తెలుసంటూ ట్వీట్ చేశారు. మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నానని చెప్పారు. హ్యాపీ బర్త్ డే తెలుగు ప్రైడ్ బాబు.. యాష్ ట్యాగ్ తో, చంద్రబాబు వీడియో సందేశాన్ని లోకేశ్ ట్వీట్ చేశారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో తన తండ్రి చంద్రబాబు సందేశాన్ని వినిపించారు. వీడియోలో చంద్రబాబు మాట్లాడుతూ.. జీవితంలో తనకు రెండు యాంబిషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. పేదరికంలేని సమాజం ఏర్పడాలని, ఇది ఎన్టీ రామారావు సిద్ధాంతమని చెప్పారు. అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని అన్నారు. ప్రతీ కుటుంబం.. ఉదాహరణకు దళిత కుటుంబం లాంటి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి అగ్రజాతిగా, అందరికంటే ముందుండేలా చేయాలన్నది తన కోరిక అని చంద్రబాబు చెప్పారు.