హైదరాబాద్ జనాభా కోటి దాటింది..

Hyderabad’s population has crossed one crore.

భారత్ లో జనాభా చైనా ను దాటితే..హైదరాబాద్ లో జనాభా కోటి దాటింది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ మహానగరం.. జనాభాలోనూ కోటి దాటినట్లు తేలింది. అనేక కులాల వారు , జాతుల వారు , విభిన్న వ్యక్తులు ఇలా ఎంతోమంది హైదరాబాద్ లో జీవనం సాధిస్తున్నారు. ఒక్కసారి హైదరాబాద్ కు అలవాటుపడితే మళ్లీ సొంత ఊరికి వెళ్లలేరు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించింది. సంపద సృష్టిలోనూ సత్తా చాటుతున్నది.

ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో స్థానం దక్కించుకున్నది. దీంతో ఎక్కడెక్కడో వారు హైదరాబాద్ లో స్థిరపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జనాభా 1.05 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 1.08 కోట్లకు చేరనుందని పేర్కొంది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 నగరాలలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో హైదరాబాద్ 6వ స్థానంలో నిలవగా.. ప్రపంచంలో 34వ స్థానంలో నిలిచింది. పట్టణీకరణ పెరగడంతో తెలంగాణ జనాభాలో మూడోవంతు హైదరాబాద్ లోని నివసిస్తుంది.

మరోపక్క ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ మైగ్రేషన్‌ సంస్థ హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌.. ‘వరల్డ్‌ వెల్దీయెస్ట్‌ సిటీస్‌ రిపోర్ట్‌-2023’ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 97 నగరాలతో ఈ వార్షిక జాబితా విడుదలైంది. ఇందులో హైదరాబాద్‌ కూడా మెరిసింది.2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో అపర కుబేరులు (హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌) ఏకంగా 78 శాతం పెరిగినట్టు తాజా నివేదిక స్పష్టం చేసింది.