ఇలాంటి వర్షాన్ని నా జీవితంలో చూడలేదు..మంత్రి కెటిఆర్‌

సాధారణం కంటే 80 శాతం ఎక్కువ వర్షం కురిసింది

minister-ktr

హైదరాబాద్‌: రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్ వరదలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద వర్షమని ఆయన అన్నారు. 40 ఏళ్లుగా తాను హైదరాబాదులో ఉన్నానని… ఇంతటి భారీ వర్షాలను తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా వర్షం పడిందని చెప్పారు. హైదరాబాదులో సాధారణం కంటే 80 శాతం అధిక వర్షం పడిందని అన్నారు. 1908లో మూసీ నదికి వరదలు వచ్చాయని… ఆనాడు ఒక్కరోజే 43 సెం.మీ. వర్షం కురిసిందని కెటిఆర్ చెప్పారు. మళ్లీ ఇప్పుడు అంత స్థాయిలో ఒకే రోజు వర్షం కురిసిందని తెలిపారు. 1916లో ఒక్క ఏడాదిలో 160 సెం.మీ. వర్షం పడిందని… ఈ ఏడాది ఇప్పటికే 120 సెం.మీ. వర్షం కురిసిందని చెప్పారు. హైదరాబాదులో ప్రతి ఏడాది సగటున 78 సెం.మీ. వర్షం కురుస్తుందని తెలిపారు.

భారీ వర్షాలలో కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది ఎంతో శ్రమించి పని చేస్తున్నారని… అందువల్లే ఎంతోమందిని కాపాడగలిగామని కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం వరద పనులపైనే వున్నారని అన్నారు. వరద బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 33 మంది చనిపోయినట్టు గుర్తించామని, మరి కొందరు మిస్సింగ్ అని తెలుస్తోందని… వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. చనిపోయినవారి కుటుంబాలకు ఇప్పటికే సాయాన్ని అందించామని తెలిపారు. ఈ అంశంపై విపక్షాలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. 37 వేల కంటే ఎక్కువ కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని అన్నారు. వారికి ఆహారం, మందులు అందిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉందని కెటిఆర్ చెప్పారు. సహాయచర్యల కోసం రూ. 45 కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. గంట, రెండు గంటల పాటు కుంభవృష్టి కురుస్తుండటంతో అత్యధిక నష్టం సంభవిస్తోందని చెప్పారు. ఆర్థిక సాయం చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని… వారు ఎంత వరకు సాయం చేస్తారో చూడాలని అన్నారు. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారని చెప్పారు. నగరంలో అందరూ అప్రమత్రంగా ఉండాలని సూచించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/