కోమటిరెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదిః బిఆర్ఎస్ ఎంపీ

ఇంత దుర్మార్గంగా గతంలో ఏ మంత్రి వ్యవహరించలేదని వ్యాఖ్య

brs

హైదరాబాద్‌ః మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బిఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో కోమటిరెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించారని విమర్శించారు. ఆయన తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. ఇంత దుర్మార్గంగా గతంలో ఏ మంత్రి వ్యవహరించలేదన్నారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై దాడి ఘటన మీద ఎంపీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల అమలుపై ప్రశ్నించినందుకే సందీప్ రెడ్డిపై దాడి చేశారని ఆరోపించారు.

కోమటిరెడ్డి తాను మంత్రి అనే సోయి లేకుండా నిందించడం హేయమైన చర్య అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకం చేశారన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులతో ఏకమై గుండాయిజం చేశారని ఆరోపించారు. కోమటిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కావడం లేదన్నారు. అటవిక పాలనతో కాంగ్రెస్ ప్రజాగ్రహానికి గురవుతోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో తాము ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. కోమటిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని హితవు పలికారు. ఇలా చేస్తే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదన్నారు. కోమటిరెడ్డి అహంకారాన్ని వదులుకోవాలని సూచించారు.