నుమాయిష్ ఎగ్జిబిషన్ రద్దు..ఆవేదనలో వ్యాపారస్తులు

కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో నాంపల్లి నుమాయిష్ పై కీలక నిర్ణయం తీసుకుంది ఎగ్జిబిషన్ సొసైటీ. ఈ ఏడాది నుమాయిష్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన తో వ్యాపారస్తులు లోబోదిబోమంటున్నారు. హైదరాబాద్​ నాంపల్లిలో ఏటా 45 రోజుల పాటు జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్​ ఈ సారి అర్ధంతరంగా నిలిచిపోయింది. జనవరి1న ప్రారంభమైన నుమాయిష్.. జనవరి 2 వ తేదీ వరకు కొనసాగినా.. అదే రోజు రాత్రి నుంచి జనవరి 10 వరకు మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 45 రోజుల పాటు కొనసాగాల్సిన నుమాయిష్ కేవలం రెండు రోజులకే మూత పడటంతో … దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్టాల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని తమ వస్తువులను అమ్ముతుంటారు. ఇక నుమాయిష్‌కు ప్రతి రోజు 50 వేలమంది వస్తుంటారు. ఈ 45 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శిస్తారు. రద్దీ ఎక్కువగా ఉండటం కారణంగా ఇక్కడ ఎన్ని ఆంక్షలు పెట్టినా కరోనా కట్టడి సాధ్యం కాదని భావించిన అధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ పూర్తిగా దీనిని రద్దు చేసింది.

అన్ని శాఖల పర్మిషన్లు తీసుకుని, హైకోర్టు గైడ్​లైన్స్, కొవిడ్​రూల్స్​పాటిస్తూ నిర్వాహకులు ఎగ్జిబిషన్​స్టార్ట్​చేశారు. 45 రోజుల పాటు నిర్వహించేలా దేశవ్యాప్తంగా వచ్చిన వేలమంది వ్యాపారులకు స్టాళ్లు కేటాయించారు. అంతా సవ్యంగా జరుగుతోంది.. విజిటర్స్​ పెరుగుతున్నారు అనుకున్న టైంలో ఆపేయాలని ఆదేశాలు రావడంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. లక్షలు ఖర్చుచేసి స్టాల్ రెంటు, కరెంట్ బిల్లులు కట్టామని, అప్పులు తెచ్చి సరుకు కొన్నామని ఆవేదన చెందుతున్నారు. నుమాయిష్​లో స్టాల్ పెట్టేందుకు కశ్మీర్ నుంచి వచ్చాం. కశ్మీర్ లెదర్, శాల్స్, డ్రెస్సెస్, జువెలరీ, డ్రై ఫ్రూట్స్ తెచ్చాం. 30 ఏండ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఎగ్జిబిషన్​కు పర్మిషన్​ ఇచ్చారని తెలుసుకున్నాకే వచ్చాం. కానీ స్టార్ట్​ చేసిన 2 రోజులకే బంద్​ అయ్యింది. ఇప్పుడు మీము ఏమైపోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.