‘బంగార్రాజు’కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

టాలీవుడ్ మన్మధుడు , కింగ్ నాగార్జున కు ‘వార్త’ తరుపున ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతుంటుంది. కానీ నాగార్జున కు మాత్రం వయసు పెరిగేకొద్దీ అందం రెట్టింపు అవుతుంది. మగువులు సైతం ఈర్షపడేలా ఇప్పటికి ఆకట్టుకోవడం ఒక్క నాగార్జునకే సొంతం.

సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. నాగార్జున మొదటి వివాహం ఫిబ్రవరి 18, 1984 నాడు లక్ష్మితో జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్కు సోదరి. వీరిరువురు విడాకులు తీసుకున్నారు. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు.

నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో చేసిన శివ మూవీ నాగార్జున ను మాస్ హీరో చేసింది. కృష్ణవంశీ డైరెక్షన్లో చేసిన నిన్నే పెళ్లాడతా మూవీ భారీ విజయం సాధించడమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర చేసింది.

ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. ఇలా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన నాగ్..ప్రస్తుతం బంగార్రాజు చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ లో నాగ్ తో పాటు నాగ చైతన్య నటిస్తుండగా..కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకా ఎన్నో మంచి చిత్రాలు నాగార్జున చెయ్యాలని ఆశిస్తూ…మరొకసారి..పుట్టిన రోజు శుభాకాంక్షలు.