ఆస్కార్ నామినేషన్లో ‘నాటు …నాటు’

95 వ ఆస్కార్ నామినేషన్లలో తెలుగు సినిమా పాట నమోదైంది. బాహుబలి తో తెలుగు సినిమా సత్తా చాటిన దర్శక ధీరుడు రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ఆస్కార్ బరిలోకి తెలుగు సినిమా ను తీసుకెళ్లాడు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ను దక్కించుకున్న ఆర్ఆర్ఆర్..ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో నిలువడం విశేషం.

ఆస్కార్ అవార్డుల నేపథ్యంలో నేడు తుది నామినేషన్లు ప్రకటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్… ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో నిరాశపరిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఈ రెండు కేటగిరీల్లో నామినేషన్ దక్కలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ ఖరారైంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది. నాటు నాటు పాటకు కీరవాణి బాణీలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది. ఇదే కాకుండా, ఈ కేటగిరీలో హోల్డ మై హ్యాండ్ (టాప్ గన్ మావెరిక్), దిసీజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్) గీతాలు కూడా ఆస్కార్ తుది నామినేషన్లలో చోటు దక్కించుకున్నాయి. ఇక, అవతార్ సీక్వెల్ అవతార్: ద వే ఆఫ్ వాటర్ చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది.

అటు, విఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో తెరకెక్కిన ద ఫేబుల్ మాన్స్ ఉత్తమ చిత్రం రేసులో స్థానం పొందింది. అంతేకాదు, ఈ సినిమాకు గాను స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ సొంతం చేసుకున్నారు.

ఉత్తమ చిత్రం నామినేషన్లు బరిలో..

అవతార్: ద వే ఆఫ్ వాటర్
టాప్ గన్ మావెరిక్
ట్రయాంగిల్ ఆఫ్ శాడ్ నెస్
ఉమెన్ టాకింగ్
ద ఫేబుల్ మాన్స్
ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్
ద బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
ఎల్విస్
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్
టార్

ఉత్తమ దర్శకులుగా నామినేషన్లు బరిలో..

ద ఫేబుల్ మాన్స్ (స్టీవెన్ స్పీల్ బెర్గ్)
మార్టిన్ మెక్ డొనా (ద బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
టాడ్ ఫీల్డ్ (టార్)
రూబెన్ ఓస్ట్ లండ్ (ట్రయాంగిల్ ఆఫ్ శాడ్ నెస్)
డానియెల్ క్వాన్, డానియల్ షీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్).