జగన్ దగ్గరికి ఆర్ఆర్ఆర్ టీం..

ఏపీలో సినిమా టికెట్స్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసేందుకు ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య సిద్ధం అవుతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాత దానయ్య నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇద్దరూ స్టార్ హీరోలతో.. జక్కన్న చేస్తున్న సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 07 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్‌ ధరల తగ్గింపు వ్యవహారంపై నిర్మాత డీవీవీ దానయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల తగ్గింపు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని..అయితే, ఈ విషయంపై న్యాయం కోరుతూ మేము లేదా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి మా పరిస్థితిని తెలియజేసి సరైన పరిష్కారం కోరుతాం” అని దానయ్య ట్వీట్‌ చేశారు.

ఆంధ్ర ఏరియాను 100 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేసారు ఆర్ఆర్ఆర్ సినిమాను. ఇప్పుడు ఆంధ్రలో రేట్లు లేవు. అందువల్ల కనీసం 20 శాతం రేట్లు తగ్గించాలన్నా దాదాపు 20 కోట్లు ఆదాయం పడిపోతుంది. పైగా సీడెడ్ కూడా అదే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కొత్త రేట్లు కాదు సరికదా, పాత రేట్లు ఇచ్చినా ఆర్ఆర్ఆర్ కు సరిపోవు. తొలివారం అయిదువందల యూనిఫారమ్ రేటు పెడితే తప్ప గిట్టుబాటు కాదు. గతంలో బాహుబలి వన్ అండ్ టూ కి ఇలాగే అయిదు వందల నుంచి వెయ్యి రూపాయలు అమ్మడం ద్వారా కోట్లకు కోట్లు జనం నుంచి లాగేయగలిగారు. ఇప్పుడు అందుకోసమే జగన్ ను దానయ్య కలవాలని అనుకుంటున్నారు.