మంత్రి కాకాణి పీఏకు బ్యాంకు రికవరీ నిర్వాహకుల బెదిరింపులు

ఎక్కడ చూసిన లోన్ యాప్ నిర్వాహకుల వేదింపులు ఎక్కువైపోతున్నాయి. వీరి వేదింపులు తట్టుకోలేక ఇప్పటికే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బు ఆశ చూపడం..ఎలాంటి ఆధారాలు లేకుండానే డబ్బులు ఇవ్వడం ఆ తర్వాత అధిక వడ్డీ తో డబ్బును వసూళ్లు చేయడం చేస్తున్నారు. సకాలంలో డబ్బు చెల్లించకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ బెదిరింపులకు భయపడి చాలామంది ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలకే కాదు రాజకీయ నేతలకు సంబదించిన వ్యక్తులకు కూడా ఈ బెదిరింపులు వదలడం లేదు. తాజాగా ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పీఏకు బ్యాంకు ఏజెంట్ల నుంచి కాల్స్ వచ్చాయి. ఈఎంఐ చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. లోన్‌ కట్టకపోతే పిల్లలను చంపేస్తామంటూ వార్నింగ్‌ ఇవ్వడం కలకలం సృష్టించింది

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈ నెల 25న వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పీఏ శంకర్ కు కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్‌ల నుంచి ఫోన్ వచ్చింది. గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఒక మహిళ కాల్ చేశారు. ‘మీరు లోన్ తీసుకున్నారని.. కట్టకపోతే మీ పిల్లలను చంపేస్తామని’ బెదిరించారు. డబ్బులు బలవంతంగా వసూలు చేయడానికి ప్రయత్నించారు. అసభ్యంగా మాట్లాడడంతో శంకర్ రూ. 25 వేలు చెల్లించారు. అక్కడితో ఆగకుండా తిరిగి మళ్ళీ, మళ్ళీ కాల్స్ చేసి వేధిస్తుండడంతో నేరుగా జిల్లా ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేయగా.. ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసులు రంగంలోకి దిగి చెన్నై వెళ్లి దర్యాప్తు చేశారు. సదరు కోల్‌మన్ కంపెనీలో సాంకేతిక ఆధారాలను సేకరించి.. మేనేజర్ మామిడిపూడి గురు ప్రసాద్, శివనాసన్ మహేంద్రన్, టీం లీడర్ మాధురి, నెల్లూరులోని ఫైనాన్స్ కంపెనీ రికవరీ మేనేజర్ పెంచలరావుని అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన ల్యాప్ టాప్ , మొబైల్స్ సీజ్ చేశారు. రూ.10వేల కూడా స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని ‘కోల్ మాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వివిధ బ్యాంక్‌లకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు లోన్ రికవరీ ఏజెన్సీగా పని చేస్తుంది.

ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక జాస్తి హరిత వర్షిణి (17) తీవ్ర మనస్తాపానికి గురైంది. అనంతరం, సూసైడ్‌ లెటర్‌ రాసి వంట గదిలో ఉరి వేసుకుని మృతిచెందింది. బ్యాంకు క్రెడిట్‌ కార్డుపై తీసుకున్న రుణం చెల్లించాలంటూ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరడంతో ఈ దారుణం జరిగింది.