చంద్రబాబు అరెస్టును చూసి అందరి గుండెలూ రగిలిపోతున్నాయి – మురళి మోహన్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయ్యి దాదాపు 50 రోజులకు దగ్గర కావొస్తుంది. బాబు అరెస్ట్ అయినా దగ్గరి నుండి టీడీపీ శ్రేణులు బాబు అరెస్ట్ ను ఖండిస్తూ వినూత్న కార్య క్రమాలు చేపడుతూ తమ నిరసన తెలియజేస్తూ వస్తున్నారు.

తాజాగా తెలుగు సినీప్రముఖుల ఆధ్వర్యంలో ‘చంద్రబాబు గారితో మనం’ అనే కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో మురళీ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. సరైన ఆధారాలు చూపకుండా చంద్రబాబును అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. టీడీపీ అధినేతను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ చంద్రబాబును 74 ఏళ్ల వయసులో అరెస్టు చేసి జైల్లో పెట్టినందుకు ప్రతి ఒక్కరూ రగిలిపోతున్నారని చెప్పారు. తమ ఆవేదనను ఎలా బహిర్గతం చేయాలనే దానిపైనే అందరి ఆలోచన ఉందని పేర్కొన్నారు. వేట సమయంలో అడవిలోని పులులు, సింహాలు నాలుగు అడుగులు వెనక్కు వేసి ఉత్సాహంతో ముందుకు దూకినట్టుగా చంద్రబాబు కూడా రెట్టించిన ఉత్సాహంతో కార్యరంగంలోకి వస్తారని అన్నారు.