అగ్రదేశాలను దాటేసిన భార‌త్‌!

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాక్సినేష‌న్ల‌ సంఖ్య 32 కోట్లు దాటింది. ఆదివారం దేశంలో 17, 21 268 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 32 కోట్ల 36 లక్షల 63 వేల 297 మందికి టీకాలు ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఫ‌లితంగా ప్రపంచంలోనే భారతదేశం అత్య‌ధిక టీకాలు వేసిన‌ దేశంగా అవతరించింది. గ్లోబల్ వ్యాక్సిన్ ట్రాకర్ అందించిన నివేదిక ప్రకారం బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, భారత్‌ల‌లో వ్యాక్సినేష‌న్ వేగంగా కొన‌సాగుతోంది.

భారతదేశంలో టీకాలు వేసే కార్యక్ర‌మం ఈ ఏడాది జనవరి 16 నుంచి ప్రారంభం కాగా, బ్రిటన్‌లో గ‌త ఏడాది డిసెంబర్ 8 న, యూఎస్‌లో డిసెంబర్ 14 న, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌ల‌లో డిసెంబర్ 27 న మొద‌ల‌య్యింది. భారతదేశంలో జూన్ 27 న 13.9 లక్షల మందికి టీకా మొదటి డోసు, 3.3 లక్షల మందికి టీకా రెండవ డోసు ఇచ్చారు. ఏప్రిల్ ఒక‌టి నుంచి దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయడం ప్రారంభించారు. మే ఒక‌టి నుంచి 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/