వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. గేదెల గుంపు అడ్డం రావడంతో లోకో పైలట్‌ సడెన్‌ బ్రేక్ వేసాడు. దీంతో ఇంజన్‌ ముందు భాగం దెబ్బతింది. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్ల సరీస్‌లో భాగంగా మూడో రైలును గాంధీ నగర్ – ముంబై సెంట్రల్ మధ్య సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభించి వారం రోజులు గడవక ముందే ఇలాంటి ప్రమాదం బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. ముంబై సెంట్రల్‌ నుంచి గాంధీనగర్‌ వెళ్తుండగా గురువారం (అక్టోబర్ 6) ఉదయం 11.15గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

గుజరాత్‌లోని బట్వా, మనినగర్‌ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, రైలును బాగు చేసి గమ్య స్థానానికి చేర్చామని పశ్చిమ రైల్వే జోన్‌ అధికారులు తెలిపారు. 100 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాస్తవానికి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఘటన జరిగిన సమయంలో 100 కిమీ వేగంతోనే ఉండంటం.. ఇంజిన్ ముందు భాగం ధ్వంస కావడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్‌ ఇంజన్‌ నాణ్యతపై పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.