ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం..

ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయలో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసారు. జూలైలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘోరం గురించి బాధిత బాలిక ఆ రోజే టీచరుకు చెప్పినప్పటికీ.. నిర్వాహకులు కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంతో ఇన్నాళ్లూ బయటపడలేదు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో బయటపడింది.

పోలీసుల కథనం ప్రకారం.. బాలిక తన క్లాస్ రూములోకి వెళ్తుండగా పొరపాటున ఇద్దరు సీనియర్లను ఢీకొట్టింది. ఆమె వారికి క్షమాపణలు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి గడియపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లగా, నిందితులైన ఇద్దరినీ స్కూలు నుంచి బహిష్కరించామని, ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని చెప్పింది. తాజాగా, ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్.. ప్రిన్సిపాల్‌తోపాటు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

ఇదిలావుంటే ఈ ఘటనపై స్పందించిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్).. బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్టుగా అసలు స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికే రాలేదని, పోలీసులు దర్యాప్తు చేపట్టిన తర్వాతే ఈ విషయం తెలిసిందని పేర్కొంది. అయితే, కేంద్రీయ విద్యాలయ రీజినల్ ఆఫీస్ మాత్రం ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది.