మూడోసారి అంబానీకి బెదిరింపులు.. ఈ సారి ఏకంగా రూ.400 కోట్లకు డిమాండ్

అడిగినంత సొమ్ము ముట్టజెప్పకపోతే చంపేస్తామని హెచ్చరిక

Mukesh Ambani receives death threat for third time, sender demands Rs 400 crore as ransom

ముంబయిః ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ మూడోసారి బెదిరింపు లేఖ అందుకున్నారు. తాము అడిగిన సొమ్ము ఇవ్వకుంటే చంపేస్తామంటూ దుండగులు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రెండుసార్లు బెదిరింపు మెయిల్స్ పంపినా పట్టించుకోలేదని హెచ్చరించారు. ఈసారి రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చంపేస్తామని, దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన షూటర్లు తమ దగ్గర ఉన్నారని చెప్పారు. సెక్యూరిటీ ఎంత పెంచుకున్నా లాభంలేదని, ‘పని పూర్తి చేయడానికి’ ఒకే ఒక్క స్నిపర్ సరిపోతాడని దుండగులు ఈమెయిల్ లో పేర్కొన్నారు.

గత వారం ముఖేశ్ అంబానీకి మొదటిసారి బెదిరింపు ఈమెయిల్ అందింది. ఇందులో దుండగులు రూ.20 కోట్లు డిమాండ్ చేశారు. తాము అడిగిన సొమ్ము ఇవ్వకుంటే అంబానీని చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన ముఖేశ్ అంబానీ పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖేశ్ కు, ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీ పెంచారు. ఆ తర్వాత దుండగుల నుంచి మరోమారు బెదిరింపు లేఖ అందింది. అందులో రూ.200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు మెయిల్స్ పంపినా డబ్బు ఇవ్వలేదంటూ ఈసారి రూ.400 కోట్లు డిమాండ్ చేస్తూ దుండగులు తాజాగా మూడో ఈమెయిల్ పంపారు.