రేపు తిరుపతి పర్యటనకు వెళ్ల‌నున్న ముఖ్యమంత్రి జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చేరుకుంటారు. ఆ తర్వాత శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుని హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌(అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాలకు హాజరవుతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నిమిత్తం అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల ప్రగతిపై సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ మేరకు పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.