మళ్లీ ముకేశ్ అంబానీకి బెదిరింపులు

అడిగినంత ఇవ్వ‌క‌పోతే అంత‌మొందిస్తామ‌ని మెయిల్స్

Mukesh Ambani gets 2 more threat mails with Rs 400-cr ransom demand

ముంబయి : రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. తాము అడిగినంత ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ తాజాగా వ‌చ్చిన మెయిల్‌లో నిందితుడు పేర్కొన్నాడు. రూ. 400 కోట్లు ఇవ్వ‌క‌పోతే త‌మ వ‌ద్ద ఉన్న అత్యుత్త‌మ షూట‌ర్లు అంబానీని కాల్చేస్తార‌ని తెలిపాడు. గ‌తంలో మెయిల్ చేసిన షాదాబ్ ఖాన్ అనే వ్య‌క్తి నుంచే ఇప్పుడు కూడా బెదిరింపు మెయిల్స్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మెయిల్స్ అక్టోబ‌ర్ 31, న‌వంబ‌ర్ 1వ తేదీన వ‌చ్చిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

రూ. 20 కోట్లు ఇవ్వాల‌ని లేనిప‌క్షంలో అంబానీని చంపేస్తామ‌ని అక్టోబ‌ర్ 27న తొలి మెయిల్ వ‌చ్చింది. రెండు సంద‌ర్భాల్లోనూ ఈ త‌ర‌హా మెయిల్స్ రావ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై, మెయిల్స్ పంపిన వ్య‌క్తిపై కేసులు న‌మోదు చేశారు. తొలుత రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన నిందితుడు.. దాన్ని రూ. 200 కోట్ల‌కు పెంచాడు. అంత‌టితో ఆగ‌కుండా రూ. 400 కోట్లు డిమాండ్ చేశారు. తాను పంపిన మెయిల్స్‌కు అంబానీ స్పందించ‌క‌పోవ‌డంతోనే రూ. 400 కోట్ల‌కు పెంచిన‌ట్లు తేలింది. గ‌తేడాది సైతం ఇలానే అంబానీని, ఆయ‌న కుటుంబాన్ని మట్టుబెడుతామ‌ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ నిర్వ‌హిస్తున్న ఆస్ప‌త్రికి ఫోన్ చేసి బెదిరింపుల‌కు గురి చేసిన సంగ‌తి తెలిసిందే.