వరుసగా మూడో ఏడాదీ పారితోషికం తీసుకోని ముఖేశ్ అంబానీ!

mukesh-ambani-foregoes-salary-for-the-third-year-in-a-row

ముంబయిః రిలయన్స్ సంస్థల అధినేత, అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ వరుసగా మూడో ఏడాదీ పారితోషికంగా కింద ఒక్క పైసా కూడా తీసుకోలేదు. 2020లో కరోనా సంక్షోభాన్ని తట్టుకునేందుకు ఆయన పొదుపు చర్యలకు ఉపక్రమించారు. కార్పొరేట్ ప్రపంచంలో అందరికీ ఆదర్శప్రాయంలో నిలుస్తూ ఆయన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా శాలరీ తీసుకోనని ప్రకటించారు. నాటి నుంచీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న అంబానీ వరుసగా మూడో ఏడాది కూడా ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. శాలరీ, ఎలవెన్సులు, రిటైరల్ బెనిఫిట్స్ లేదా కమిషన్లు, స్టాక్స్ ఆపష్స్ రూపంలో ఎటువంటి పరిహారం పొందలేదని రిలయన్స్ సంస్థ పేర్కొంది.

ప్రస్తుతం అంబానీ రిలయన్స్ సంస్థలకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. రిలయన్స్‌ ఆయన సొంతమైనప్పటికీ.. కంపెనీలో విధులు నిర్వహించినందుకు అంబానీ కూడా శాలరీ తీసుకుంటారు. 2008-09 కాలంలో ఆయన పారితోషికం ఏటా రూ. 15 కోట్లుగా ఖరారైంది. రిలయన్స్ సంస్థలకున్న మార్కెట్, ఇతర కార్పొరేట్ ప్రమాణాలతో పోల్చితే ఇదేమంతా పెద్ద పారితోషికంగా కాదని నిపుణులు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే, మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు భారీ స్థాయిలో పారితోషికాలు తీసుకోకూడదన్న తన సిద్ధాంతం మేరకు అంబానీ పరిమితమైన శాలరీనే తీసుకోవడం ప్రారంభించారు.

కాగా, భారత ప్రభుత్వానికి అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న సంస్థల్లో రిలయన్స్ కూడా ఒకటి. ఆర్థికసంత్సరం 2021-23 మధ్య మొత్తం రూ. 5 లక్షల కోట్ల పన్నులు చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కింద మొత్తం రూ.1,77,173 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించింది. భారత ప్రభుత్వ ఖర్చుల్లో ఈ మొత్తం సుమారు 5 శాతానికి సమానం.